Description
‘‘ఇరుగు పొరుగు’’ తెలుగు కన్నడ భాషా బాంధవ్యాలను, సాహిత్య దృశ్యాలను, ఆదాన ప్రదాన సమీకరణాలను, దాక్షిణాత్య సాహిత్య సంబంధాలను పుష్టిగా పరిశీలించి, విశ్లేషించిన వ్యాస సంకలనం. తెలుగు కథల్లో దళిత బహుజనవాదం ఆలోచనాత్మక వ్యాసం, దళిత బహుజనకథా సాహిత్యాన్ని లోతుగా పరిశీలించిన వ్యాసమిది, విశ్లేషణాత్మకకోణంలో సాగిన వ్యాసం. ఆంధ్ర తెలంగాణ కథతోపాటు రాయలసీమ ఫ్యాక్షనిజం దళిత జీవితాలను క్రూరంగా బలి తీసుకున్న వైనం, కళ్లకుకట్టిన కథలను నాగశేషు చర్చించాడు. బహుజనుల వాస్తవజీవితచిత్రణ విమర్శనాత్మకంగా చర్చించాడు. వివిధ వృత్తులపై వచ్చిన కథాసాహిత్యాన్ని విశదీకరించాడు. వృత్తులు జీవనోపాధికి అవసరమే అనుకున్నా, వృత్తి నేపథ్యంగా జరిగే అవమానాలు చరిత్రలో లిఖింపబడిన సాక్షాలు. తెలుగు కన్నడ సాహిత్యాలలో ముఖ్యంగా పత్రికారంగంలో స్త్రీల ప్రాతినిధ్యం ముఖ్యమే కాదు బలమైన అంశం కూడా! తొలితరం రచయిత్రులను అంటే ఆధునికకాలంలో ప్రారంభమై దేశ స్వతంత్రం పొందిన సందర్భం వరకు సాగిన తెలుగు కన్నడ పత్రికా రంగాలలో మహిళా సాహిత్యం చేసిన కృషి, సాధించిన ఘనత అందుకోసం సమాజం ఫలితాలను అందించే తీరు అద్భుతం. అలాగే ప్రాచీనతెలుగు కవయిత్రుల తులనాత్మకఅధ్యయనం బలమైన రెండుభాషాసాహిత్యాల మహిళా స్వరాన్ని వినిపించింది. 12 శతాబ్దంలో వచ్చిన ప్రాచీన కన్నడ మహిళా సాహిత్యం కన్నడ సాహిత్యంలోనే ఒక మైలురాయి! బలమైన స్త్రీ స్వరం సుమారు 35 నుంచి 40 మంది దాకా భక్తి మాధ్యమంగా సమాజ దురాగతాలను ప్రశ్నించే సందర్భం కనబడుతుంది. ఈ స్థితి ఏ ఇతర సాహిత్యంలోను లేదని గమనించవచ్చు. ప్రాచీన కన్నడ కవయిత్రుల సాహిత్యసేవను వ్యాసకర్త ఉటంకించడం ప్రశంసనీయం. తెలుగు కన్నడ కథలు బహుజనవాదం విశ్లేషిస్తూ రెండు ప్రాంతాల కథలు బహుజనుల కష్టనష్టాలు వివరిస్తూ తెలుగు సాహిత్యంలో ప్రజ్వరిల్లిన ఉద్యమకోణం కన్నడ సాహిత్యంలో అంత ఉధృతంగా లేదని వ్యాసకర్త గమనించడం, దానిని ప్రస్తావించడం అతనిలోని పరిశోధన దృక్కోణాన్ని తెలుపుతుంది. దాక్షిణాత్య భాషల్లో దేశీ కవిత్వాన్ని పరామర్శించడం ఈ వ్యాస సంకలనంలో కనబడుతుంది. తెలుగు కన్నడం తమిళ భాషల్లో శైవసాహిత్యంపై చేసిన పరిశీలన పరిశోధనాత్మకంగా ఉంది. అంతేకాకుండా స్వాతంత్రం పూర్వం కన్నడ మహిళా నవలలు అనే వ్యాసం కన్నడ భాషకు స్త్రీల సాహిత్య కానుకగా అభివర్ణించవచ్చు. కురుబ కులంబి స్త్రీలు సాహిత్య కృషి ఒక ప్రత్యేకమైన వ్యాసం. కన్నడ ప్రాంతంలో ఉన్న కురుబ స్త్రీల సాహిత్యం వచన రూపంలో ఉండటం 14వ శతాబ్దం తర్వాత కురుబ స్త్రీల సాహిత్యం కనబడకపోవడానికి సామాజిక కోణాలు ఎన్నో వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాసాల నేపథ్యంలో వ్యాసకర్త ఎన్నో సామాజిక దురాగతాలపై ప్రశ్నల వర్షం కురిపించాడు. సమాజం సమాధానం చెప్పి తీరాలి. పై వ్యాసాలే కాక ధూర్జటి వర్ణనావైభవాన్ని జాషువా, జాషువాగబ్బిలం, కందుకూరి వీరేశలింగంవంటి సంఘ సంస్కర్తపై వ్యాసాలు, అనంతపురం కరువుగురించి వ్యాసం, గురజాడ గురించి, తెలుగుభాషా పోషణపట్ల సుల్తానుల కృషి, విద్వాన్ విశ్వం పెన్నేటి పాట, తిరుమల రామచంద్ర చారిత్రాత్మక పరిశోధనవంటి ప్రాచీన ఆధునిక సాహిత్య అంశాలు విమర్శనాత్మక కోణంలో పరిశీలించబడ్డాయి. పరిశోధనాభిలాషులకు, ముఖ్యంగా తెలుగు కన్నడ తులనాత్మకపరిశీలనాభిలాషులకు ఈ వ్యాస సంకలనం ఉపయుక్తంగా ఉంటుంది. నాగశేషు మా తెలుగుశాఖ విద్యార్థి, కన్నడ భాషపట్ల అవగాహన, సాహిత్యం పట్ల అభిరుచి కలిగిన వ్యక్తి, మంచి పరిశోధకుడు, సాహిత్యాధ్యయనశీలిగా నాగశేషు చేసిన ప్రయత్నం అభినందనీయం. నాగశేషు మరింతగా ఎదగాలని ఆలోచనాత్మక వ్యాసాలు ఉన్న ఈ వ్యాస సంకలనం అందరికీ చేరాలని, నాగశేషు విమర్శనా రంగంలోనూ, తులనాత్మక అధ్యయనంలోనూ మరింత ఎదగాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తున్నాను. ---ఆచార్య.కె. ఆశాజ్యోతి తెలుగుశాఖ,బెంగళూరు విశ్వవిద్యాలయం
ISBN 9789354077197